![]() |
![]() |

ఖరీదైన ఇళ్ళు, కార్లు కొనుగోలు చేయడంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పుడూ ముందుంటారు. అయితే నటీనటులే కాకుండా, వారి వ్యక్తిగత సిబ్బంది కూడా కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) మేనేజర్ పూజా దద్లానీ (Pooja Dadlani) మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు రూ. 38 కోట్ల విలువైన ఈ రియల్ ఎస్టేట్ డీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ముంబైలో భారీ పెట్టుబడి
గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పూజా దద్లానీ, రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో కార్టర్ రోడ్‌లో ఉన్న వరుణ్ అనే విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ఆమె మూడు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఈ మూడు అపార్ట్‌మెంట్ల మొత్తం విలువ ఏకంగా రూ. 38.21 కోట్లు అని సమాచారం. పూజాతో పాటు ఆమె భర్త హితేష్ ప్రకాష్ గుర్నానీ, తండ్రి మోహన్ సియోరామ్ దద్లానీ పేర్ల మీద ఈ ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి.
అపార్ట్‌మెంట్ వివరాలు
ఈ మూడు ఫ్లాట్లు కలిపి మొత్తం 4,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 1,511 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగి ఉండగా, వీటికి అదనంగా బాల్కనీలు కూడా ఉన్నాయి. సీ(సముద్రం) ఫేసింగ్ ఉండే ఈ ఫ్లాట్లకు ఒక్కో దానికి రెండు చొప్పున మొత్తం ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఈ డీల్ కోసం పూజా దద్లానీ కుటుంబం ఏకంగా రూ. 2.16 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 90,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2028 డిసెంబర్ నాటికి స్వాధీనం చేసే అవకాశం ఉంది.
షారుఖ్‌కు అత్యంత ఆప్తురాలు
పూజా దద్లానీ కేవలం మేనేజర్ మాత్రమే కాదు, షారుఖ్ ఖాన్ కుటుంబంలో ఒక సభ్యురాలిగా గుర్తింపు పొందారు. 2012 నుండి షారుఖ్‌తో కలిసి పని చేస్తున్న ఆమె, ఆయన సినిమాల షెడ్యూల్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తారు. గతంలో ఆమె ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను షారుఖ్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా డిజైన్ చేయడం విశేషం.
![]() |
![]() |